Page Loader
రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 
రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు

రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 

వ్రాసిన వారు Stalin
Jul 05, 2023
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంక్షోభం రసకందాయంలో పడింది. ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం బుధవారం ముంబైలో వేర్వేరుగా పోటీపోటీగా సమావేశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు తమ చీఫ్ విప్‌లను నియమించుకున్నాయి. సమావేశానికి హాజరు కావాలని విప్‌ను జారీ చేశాయి. శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబి చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం 1 గంటలకు సమావేశం కానుంది. అజిత్ పవార్ బృందం ఉదయం 11 గంటలకు సబర్బన్ బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఎంఈటీ) ప్రాంగణంలో సమావేశమవుతుంది.

ఎన్సీపీ

ఎవరివైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై క్లారిటీ 

శరద్ పవార్ వర్గానికి చీఫ్ విప్‌గా పనిచేస్తున్న జితేంద్ర అవద్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్‌లను సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశారు. అదే సమయంలో, అజిత్ పవార్ తన వర్గానికి చీఫ్ విప్‌గా అనిల్ పాటిల్‌ను నియమించారు. అతను సమావేశానికి రావాలని నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కోరారు. ఇన్నాళ్లు ఎవరివైపు ఎంతమంది ఉన్నారన్నది క్లారిటీ లేదు. ఈ రెండు సమావేశాలతో ఎవరివైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న వాస్తవ లెక్క తేలనుంది.

ఎన్సీపీ

వేటు తప్పించుకుకోవాలంటే అజిత్ పవార్‌కు 36మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం

శివసేన- బీజేపీ క్యాబినెట్‌లో ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్, మొత్తం 53 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అయితే శరద్ పవార్ వర్గం దీనిని ఖండించింది. అజిత్ పవార్‌కు కేవలం 13మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నదని శరద్ పవార్ వర్గం చెబుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎన్సీపీకి 53మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్‌ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా, అనర్హత వేటు తప్పించుకోవాలంటే అతనికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఎన్సీపీ

నేటితో ఎన్సీపీ సంక్షోభానికి తెరపడుతుందా?

ఇదిలా ఉంటే, తమకు 36మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, లేఖపై సంతకం కూడా చేశారని అజిత్ పవార్ వర్గం వాదిస్తోంది. బీజేపీ అయితే ఏకంగా అజిత్‌ వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతోంది. మరోవైపు, మెజార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ తమవైపే వైపే ఉన్నారని శరద్ పవార్ వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే అజిత్ పవార్, ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన ఎనిమిది మందిపై అనర్హత వేటు వేసేందుకు పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో నేడు జరిగే సమావేశాలకు విశేష ప్రాధాన్యతం ఉందనే చెప్పాలి. ఎన్సీపీలో రాజకీయ సంక్షోభానికి నేటితో తెర పడే అవకాశమూ లేకపోలేదు.