PM Modi: 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎమర్జెన్సీ అమలై 51 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీని అత్యంత చీకటి అధ్యాయంగా అభివర్ణించిన ఆయన, అది కాంగ్రెస్ చేసిన క్షమించరాని తప్పిదమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని విధించిన వారిని దేశ ప్రజలు "ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు" అని ఆయన పిలుపునిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన సుదీర్ఘ పోస్టులో "ఎమర్జెన్సీ 51వ వార్షికోత్సవం - భారత ప్రజాస్వామ్య చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని గుర్తు చేసుకుందాం" అనే శీర్షికతో ఆనాటి పరిస్థితులను మోదీ వివరించారు. ఎమర్జెన్సీ సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులు, మీడియా స్వేచ్ఛలను తీవ్రంగా అణచివేశారని ఆరోపించారు.
వివరాలు
ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ
ప్రతిపక్ష నేతలను పెద్దఎత్తున అరెస్టు చేశారని,ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, రాజకీయ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని కఠినంగా అణచివేశారని పేర్కొన్నారు. రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలను కూడా జైళ్లలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని విమర్శించారు. అదే సమయంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని, న్యాయవ్యవస్థను రాజకీయ నియంత్రణలోకి తీసుకురావడానికి అనుచిత ప్రయత్నాలు జరిగాయని మోదీ ఆరోపించారు. మీడియాపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారిని బెదిరించడం, కొన్ని పత్రికలను మూసివేయడం వంటి చర్యలు చేపట్టారని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేశారని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలే వారికి వ్యతిరేకంగా పనిచేశాయని విమర్శించారు. అలాగే పార్లమెంటును కేవలం 'రబ్బరు స్టాంపు'గా మార్చేశారని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
ఇలాంటి నిర్బంధ పరిస్థితుల మధ్య కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేక మంది పోరాటం చేశారని మోదీ గుర్తు చేశారు. భిన్న సిద్ధాంతాలు, విభిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఏకమై ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఉద్యమించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో తాను కూడా పాల్గొనే అవకాశం దక్కడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజల సంకల్పం, పోరాట స్ఫూర్తి ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదని మోదీ అన్నారు.
వివరాలు
ఎమర్జెన్సీ అమలు చేసిన వారి చరిత్రపై శాశ్వత మచ్చ
చివరికి ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించగా, దానిని అమలు చేసినవారు ఘోర పరాజయాన్ని చవిచూశారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనే ఘోర పాపం దానిని అమలు చేసిన వారి చరిత్రపై శాశ్వత మచ్చగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ధైర్యంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా దేశం వందనం చేస్తోందని, వారి త్యాగాల వల్లే భారత ప్రజాస్వామ్యం నిలబెట్టుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.