TGRTC: తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు.. రద్దీని తగ్గించేందుకు సీఎం కీలక అదేశాలు
తెలంగాణ ఆర్టీసీలో రద్దీ పెరగడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక అదేశాలను జారీ చేశారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించడం వల్ల, బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఫ్రీ బస్ పథకం విజయవంతంపై రేవంత్ రెడ్డి హర్షం
మహాలక్ష్మి పథకం అమలు ప్రారంభం నుండి, రోజుకు ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు సీట్లు దొరకడం చాలా కష్టమవుతోంది. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సమస్య తీవ్రమైంది. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించగా, దాంతో ప్రయాణికులకు రూ. 2,840.71 కోట్ల వరకు ఆదా అయిందని అధికారులు తెలిపారు. ఫ్రీ బస్ పథకం విజయవంతం కావడంతో సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి వీలైనంత త్వరగా కొత్త బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.