China: బరితెగిస్తున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మాణం
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని 'ఫిష్‌టెయిల్స్' అనే సున్నితమైన ప్రాంతం నుంచి తూర్పుకు 20 కిలోమీటర్ల దూరంలో, వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంగా కొత్త హెలిపోర్ట్‌ను నిర్మిస్తోంది. ఈ హెలిపోర్ట్, టిబెట్ అటానమస్ రీజియన్‌లోని న్యింగ్‌చి ప్రిఫెక్చర్‌లో గోంగ్రిగాబు క్యూ నది ఒడ్డున ఉంది. ఈ నిర్మాణం చైనా సాయుధ దళాలకు మారుమూల ప్రాంతాల్లో సైనికులను వేగంగా తరలించే సామర్థ్యాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్మాణం భారతదేశానికి ముప్పు కలిగించే అవకాశముందని కూడా భావిస్తున్నారు. EOS డేటా అనలిటిక్స్ ద్వారా అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాల ప్రకారం,2023 డిసెంబరు 1న ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం కనబడలేదు.
హెలికాప్టర్‌ల టేకాఫ్ కోసం రోలింగ్ టెక్నిక్
అయితే,డిసెంబరు 31న సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో భూమిని క్లీర్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు కనిపించింది. 2024 సెప్టెంబరు 16న తీసిన తాజా అధిక-రిజల్యూషన్ చిత్రాలు, ఆ ప్రాంతంలో ఒక ఆధునిక హెలిపోర్ట్ నిర్మాణం జరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ హెలిపోర్ట్ 600 మీటర్ల రన్‌వేను కలిగి ఉండగా, హెలికాప్టర్‌ల టేకాఫ్ కోసం రోలింగ్ టెక్నిక్ ఉపయోగించవచ్చు. ఇది,ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో,తక్కువ విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పుడు హెలికాప్టర్‌లు సులభంగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతం సుమారు 1500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంటెలిజెన్స్ నిపుణుల అభిప్రాయాల ప్రకారం,ఈ హెలిపోర్ట్,PLA గూఢచారి కార్యకలాపాలు,నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి ఉపయోగపడుతుంది. అదనంగా,హెలిపోర్ట్‌లో మూడు హ్యాంగర్‌లు,ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యం,ఇతర అనుబంధ భవనాల నిర్మాణం కూడా జరుగుతోంది.