Delhi Ramlila Maidan Protest Rules: ఢిల్లీలో నిరసనలకు కొత్త కండిషన్లు.. 50 వేల మందికే అనుమతి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో నిరసనలు, ఆందోళనలకు కేంద్రంగా ఉన్న మరో వేదికపై ఆంక్షలు విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన ఢిల్లీ పోలీసులు.. ఇప్పుడు రాంలీలా మైదానంలోనూ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇకపై ఇక్కడ నిర్వహించే ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలకు గరిష్ఠంగా 50 వేల మందికే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంతేకాదు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రత్యామ్నాయ వేదికగా రాంలీలా మైదానం
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా రాంలీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ మైదానాలను గత అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
తాజాగా రాంలీలా మైదానానికి సంబంధించి ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్ఓపీ) రూపొందించారు.
కార్యక్రమం స్వభావం, అంచనా జనసందోహం, భద్రతా ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకుని ఎంతమందికి అనుమతి ఇవ్వాలనేది అధికారులు నిర్ణయించనున్నారు.
వివరాలు
కార్యక్రమానికి పది రోజుల ముందే దరఖాస్తు
కొత్త నిబంధనల ప్రకారం.. కార్యక్రమ నిర్వాహకులు తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) నుంచి మైదానం అందుబాటుపై అనుమతి తీసుకోవాలి.
ఆ తర్వాత పోలీసులకు దరఖాస్తు సమర్పించాలి. సాధారణంగా కార్యక్రమం నిర్వహించడానికి కనీసం పది రోజుల ముందే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాలు దిగే ప్రాంతాలు, అత్యవసర మార్గాల నిర్వహణ బాధ్యత నిర్వాహకులపైనే ఉంటుంది.
వివరాలు
ఆయుధాలు, డ్రోన్లపై ఆంక్షలు
మైదానంలోకి తుపాకులు, కత్తులు, ఈటెలు, ఇతర పదునైన వస్తువులను అనుమతించరు. డ్రోన్లను వినియోగించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి.
అంతేకాకుండా కార్యక్రమ నిర్వాహకులు తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలి.
ప్రస్తుతం ఈ నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఆమోదం కోసం వేచి ఉంది.
అక్కడి నుంచి తుది ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.