తిరుమల లడ్డూ కోసం స్పెషల్ కౌంటర్లు..భక్తులకు మరిన్ని సేవలపై తితిదే కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను తితిదే అందించనుంది.
ఈ మేరకు తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం బోర్డ్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
భక్తుల సేవలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు లడ్డు కౌంటర్లల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కోసం రూ.14 కోట్లతో ప్రత్యేకంగా అదనపు లడ్డూ కౌంటర్లను నిర్మిస్తామన్నారు. రూ. 97 కోట్లతో స్విమ్స్ ఆధునీకరణకు నిధులను వెచ్చిస్తామన్నారు.
తిరుమలలో 1200 పడకలతో ఆస్పత్రిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.6.65 కోట్లతో తిరుచానూరు పుష్కరిణి అభివృద్ధి పనులు చేపడతామని సుబ్బారెడ్డి వివరించారు.
DETAILS
ఇకపై తితిదే అన్ని విభాగాలు కంప్యూటరైజ్డ్: ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
రూ.7 కోట్లతో తితిదే అన్ని విభాగాల్లో కొత్త కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తీర్మానించినట్లు ఛైర్మన్ స్పష్టం చేశారు.
రూ.20.50 కోట్లతో సేవాసదన్, వకుళమాత దేవాలయంతో పాటు పలు గదుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తామన్నారు.
రూ.2.35 కోట్లతో హెచ్‌వీసీలోని 144 గదులను ఆధునీకరణ చేయనున్నామన్నారు. రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్ల అభివృద్ధి, 3 ఏళ్ల పాటు చెత్త నిర్వహణ టెండర్‌ను ఎల్టీఈ సంస్థకు రూ.40.50 కోట్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. రూ.1.88 కోట్లతో జీఎంసీ, ఎస్ఎంసీ ఉప విచారణ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
రూ.4 కోట్లతో ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి సన్నిధిలో అన్నదాన భవన నిర్మాణం చేస్తామని, రూ.3.10 కోట్లతో తిరుమలలో స్టైన్ లెస్ స్టీల్ బిన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
DETAILS
గాంధీనగర్, రాయపూర్‌లోనూ ఆలయాల నిర్మాణం : వైవీ సుబ్బారెడ్డి
మరో రూ.9 కోట్లతో తిరుమల తిరుమతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో సెంట్రల్ రికార్డు రూమ్ నిర్మిస్తున్నామన్నారు. రూ.2 కోట్లతో నగరిలోని బుగ్గ ఆలయంలో కల్యాణ మండపం నిర్మించడం, కర్నూలు జిల్లా అవుకు మండలంలో రూ.4.18 కోట్లతో ఆలయాన్ని కట్టిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాలను దాటి గుజరాత్ లోని గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లోనూ ఆలయాల నిర్మాణం చేస్తామన్నారు.
రూ.5.61 కోట్లతో రామానుజ సర్కిల్ నుంచి రోడ్డు పనుల నిర్మాణం, రూ.7.75 కోట్లతో స్విమ్స్ లో గోడౌన్ నిర్మాణం, రూ.5 కోట్లతో ఎస్వీ వేదిక్ వర్సిటీలో సిబ్బందికి నివాస సమూదాయాలను నిర్మిస్తామని చెప్పారు.
ఈ మేరకు బోర్డ్ సమావేశంలో తీర్మానించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.