LOADING...
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్‌!
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్‌!

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలంటే సాధారణంగా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ)కే కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ సంస్థల్లో ఒకటిగా పేరున్న బీఎంసీపై రాజకీయ దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ముంబయిని మించి, పెద్దగా పరిచయం లేని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్‌సీపీ, శివసేన విభజనల అనంతరం మహారాష్ట్ర రాజకీయాలు ఎంత గందరగోళంగా మారాయో అంబర్‌నాథ్‌లో జరిగిన పరిణామాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేశాయి.

Details

 అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ మద్దతు 

60 మంది సభ్యులున్న అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను అధికారానికి దూరంగా ఉంచేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. ఈ ప్రయత్నానికి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా మద్దతిచ్చింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రాష్ట్ర స్థాయిలో మిత్రులుగా ఉన్న ఈ పార్టీలే బీఎంసీ సహా పలు ప్రాంతాల్లో పరస్పరం కలవకుండా రాజకీయాలు సాగిస్తున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ పొత్తు రెండు పార్టీల్లోనూ కలకలాన్ని రేపింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించి, అంబర్‌నాథ్ యూనిట్‌ను రద్దు చేయడంతో పాటు బీజేపీతో చేతులు కలిపిన 12 మంది నాయకులను సస్పెండ్ చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ పొత్తును అంగీకరించబోమని స్పష్టం చేసింది.

Details

తీవ్ర విమర్శలు చేసిన ఉద్దవ్ ఠాక్రే

ఈ పొత్తుపై షిండే శివసేనతో పాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, దేశం నుంచి కాంగ్రెస్‌ను తరిమేయాలని మాట్లాడే బీజేపీ అదే పార్టీతో కలిసి పనిచేయడం ద్వంద్వ వైఖరేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు బీజేపీ నేతృత్వంలోని 'అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ'కి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుని, ఏక్‌నాథ్ షిండే శివసేనకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఇప్పటికే 27 మంది సభ్యులతో ఉన్న షిండే శివసేన, ఎన్‌సీపీ మద్దతుతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి సహకారంతో మెజారిటీ దాటగలిగింది.

Advertisement