
Rammohan Naidu: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ కార్యక్రమాన్ని దిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్ నుంచి ఎంపీ పురందేశ్వరితో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విమాన సర్వీసులను 'అలయన్స్ ఎయిర్' నిర్వహించనుంది. ఈ సౌకర్యం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఆకాశయానంలో సౌకర్యవంతంగా ఆధ్యాత్మిక యాత్రలు చేయగలుగుతారు. రెండో తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం, గురువారం, శనివారం అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ఈ రూట్‌ను నిర్వహిస్తుంది.
Details
నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు
అలాగే దివంగత లోక్‌సభ స్పీకర్ 'జీఎంసీ బాలయోగి' జయంతి సందర్భంగా రామ్మోహన్‌నాయుడు నివాళులర్పించారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో బాలయోగి చిత్రపటానికి అంజలి ఘటిస్తూ ఆయన జీవితాన్ని ఎన్నో తరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. కోనసీమ గడ్డ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి తెలుగువారి కీర్తిని ఎల్లలు దాటించారని, ఆయన సేవలు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రామ్మోహన్‌నాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీశ్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.