LOADING...
TVK Cabinet Ministers: తమిళనాట కొత్త ప్రభుత్వం..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం.. శాఖల కేటాయింపు వివరాలివే!
తమిళనాట కొత్త ప్రభుత్వం..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం.. శాఖల కేటాయింపు వివరాలివే!

TVK Cabinet Ministers: తమిళనాట కొత్త ప్రభుత్వం..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం.. శాఖల కేటాయింపు వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ఘన కార్యక్రమం జరగనుంది. విజయ్‌తో పాటు మొత్తం 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈక్రమంలో మంత్రివర్గ శాఖల కేటాయింపును ముందుగానే ఖరారు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంతో వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ అధికారంలోకి వస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు పడుతూ, చివరికి గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతను విజయ్‌కే అప్పగించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

విజయ్ కేబినెట్ శాఖల కేటాయింపు

ముఖ్యమంత్రి - విజయ్‌, హోం, ప్రజాపాలన శాఖలు ఆధవ అర్జున్‌ - క్రీడలు, ఎక్సైజ్ శాఖ సెంగొట్టాయన్‌ - పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) వెంకట్రామన్‌ - పాఠశాల విద్యాశాఖ ఎన్‌. ఆనంద్‌ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ CTR నిర్మల్ కుమార్‌ - విద్యుత్ శాఖ రాజమోహన్‌ - ఆదిద్రవిడ సంక్షేమ శాఖ అరుణ్ రాజ్‌ -కమర్షియల్ ట్యాక్సెస్&రిజిస్ట్రేషన్ శాఖ అయితే ఎస్‌. కీర్తన, టీకే ప్రభు‌లకు ఇప్పటికీ శాఖలు కేటాయించలేదు. అసెంబ్లీలో బల నిరూపణ పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ చెన్నై ప్రాంతానికి ఈ కేబినెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి గెలిచిన ఐదుగురికి మంత్రి పదవులు దక్కడం గమనార్హం.

వివరాలు

ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం

పట్టణాభివృద్ధి, యువత, విద్య, మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని రూపొందించినట్లు సమాచారం. మొదట విజయ్ ప్రమాణస్వీకారం మధ్యాహ్నం 3:45గంటలకు జరగాల్సి ఉన్నప్పటికీ, జ్యోతిష్య సూచనల మేరకు కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు మార్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అలాగే పదవీ విరమణ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం. మే 9న విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కలిసి, TVK శాసనసభా నాయకుడిగా ఎన్నికైనట్లు లేఖ సమర్పించారు. అనంతరం గవర్నర్ ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.

Advertisement