New IIFT Campus Kakinada: కాకినాడలో అత్యాధునిక ఐఐఎఫ్‌టీ క్యాంపస్ సిద్ధం.. రూ.230 కోట్లతో జాతీయ స్థాయి విద్యాసంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామంలో నిర్మించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) నూతన క్యాంపస్ అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైంది. దేశంలోనే ప్రముఖ వ్యాపార విద్యాసంస్థల్లో ఒకటైన ఈ క్యాంపస్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేశారు. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల వ్యయంతో ఈ బిజినెస్ స్కూల్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు సమకూర్చాయి. ప్రస్తుతం కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలోని భవనంలో నిర్వహిస్తున్న ఐఐఎఫ్‌టీ తరగతులను త్వరలోనే కొత్త క్యాంపస్‌కు తరలించనున్నారు.
వివరాలు
రాష్ట్ర విభజన హామీలో భాగంగా మంజూరు
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి జాతీయ స్థాయి విద్యాసంస్థలను కేటాయిస్తామన్న హామీ మేరకు ఐఐఎఫ్‌టీని మంజూరు చేశారు. ఈ సంస్థ ఏర్పాటుకు యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2017లో భూమిని ఉచితంగా కేటాయించింది. అనంతరం 2018 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
వివరాలు
నిర్మాణంలో జాప్యం.. తర్వాత వేగవంతం
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐఐఎఫ్‌టీ నిర్మాణ పనులపై నాలుగేళ్లపాటు తగిన దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2022లో కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలోని తాత్కాలిక భవనాల్లో విద్యా కార్యక్రమాలు ప్రారంభించారు. ఎన్నికలకు ఏడాది ముందు కేంద్రం విడుదల చేసిన నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించినప్పటికీ, ఏడాదిలో కేవలం 7 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ నిర్మాణాన్ని పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అవసరమైన చర్యలు చేపట్టి పనులను వేగవంతం చేయడంతో క్యాంపస్ నిర్మాణం పూర్తయింది.
వివరాలు
ఆకట్టుకునే మౌలిక వసతులు
మొత్తం 3.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్‌లో ఆధునిక విద్యా, పరిపాలనా సదుపాయాలను కల్పించారు. అకడమిక్,అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లతో కూడిన ప్రధాన భవనంలో 16 తరగతి గదులు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లో విస్తరించిన డిజిటల్ గ్రంథాలయంతో పాటు రెండు సెమినార్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల కోసం 192 గదులతో వసతిగృహాన్ని నిర్మించారు. అదనంగా 400 మంది సామర్థ్యంతో ఆడిటోరియం, 300 సీట్ల యాంఫీ థియేటర్, ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేసి విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు.