AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం విధానంపై కసరత్తును దాదాపు పూర్తి చేసింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలులో ఉన్న మద్యం విధానాన్ని పునరుద్ధరించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, కర్ణాటక వంటి పక్క రాష్ట్రాల కంటే తక్కువ ధరల్లో మద్యం విక్రయించేలా పాలసీ రూపొందిస్తామని సమాచారం. ప్రస్తుతం ఏపీలో అమలులో ఉన్న మద్యం విధానం సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది.
అక్టోబర్ 1 నుంచి నూతన పాలసీ
అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కొత్త విధానంపై సమావేశాలు నిర్వహించింది. సెప్టెంబరు 17న సబ్ కమిటీ చివరి భేటీ జరగనుంది. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. కావున సుదీర్ఘ కసరత్తుతోనే కొత్త మద్యం విధానాన్ని తీసుకురాబోతున్నామని కూటమి నేతలు పేర్కొంటున్నారు.