ఏపీలో నయా పాలిటిక్స్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటోంది. రాజకీయ చైతన్య వేదిక విజయవాడ వేదికగా మరో కొత్త పార్టీకి ఏపీ జన్మనివ్వబోతోంది. కొత్త రాజకీయ పార్టీని మాజీ ఐఏఎస్ అధికారి విజీఆర్ నారగోని, ప్రముఖ పారిశ్రామికవేత్త, బీసీ నాయకుడు పుంగనూరు రామచంద్ర యాదవ్ లు సంయుక్తంగా నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీలు, బలహీన వర్గాలు, మైనారిటీలను ఐక్యం చేసేందుకే పార్టీని ప్రారంభించనున్నామని రామచంద్ర యాదవ్ వెల్లడించారు. బహుజనుల హక్కుల కోసం నూతనంగా ఏర్పడే ఈ పార్టీ పని పనిచేస్తుందని ఆయన వివరించారు. బీసీల నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యం చేయనున్నామన్నారు. ఈ కొత్త పార్టీలోకి ఇతర పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల నుంచి చేరికలుంటాయని భావిస్తున్నారు.
తెదేపా, వైకాపా బీసీలకు పెద్దపీట వేయలేదు : కొత్త పార్టీ నేతలు
సాధారణంగా వెనుకబడిన తరగతుల వారే రాజకీయ పార్టీలకు ప్రధాన ఓటు బ్యాంకు. ఈ విషయం తెలిసే ప్రధాన పొలిటికల్ పార్టీలు తెలుగుదేశం, వైకాపా బీసీలకు పెద్ద పీట వేయట్లేదని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలనే చేస్తున్నారని, అందుకే కొత్త పార్టీ పెడుతున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేసిన రామచంద్ర, రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసమే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ పదవులు, రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహ గర్జన సభ నిర్వహిస్తామన్నారు. అదే వేదికగా బీసీల కొత్త పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తామన్నారు.