
Telangana: కొత్త ఆటోలకు కొత్త రేటు... నిరుద్యోగుల నుంచి అదనపు వసూళ్లకు మార్గం?
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగం కోసం కొత్త ఆటో కొనాలని భావించే నిరుద్యోగ యువతకు ఓ వైపు ప్రభుత్వం అవకాశాల తలుపులు తెరిచినా,మరోవైపు ప్రైవేట్ ఫైనాన్షియర్లు,ఆటో డీలర్లు సమస్యల బాటలో నెడుతున్నారు. ప్రజల మేలు కోసం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యాపార అవకాశంగా మార్చుకుని నిరుద్యోగులపై ఆర్థిక భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా రవాణా శాఖ ప్రోసీడింగ్స్ ద్వారా 20 వేల కొత్త ఆటోలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని కొందరు డీలర్లు,ప్రైవేట్ ఫైనాన్షియర్లు తన ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు సమాచారం. కొత్త ఆటో కొనేందుకు చాలామందికి బ్యాంకు లోన్ అందకపోవడంతో దాదాపు 90 శాతం మంది ప్రైవేట్ ఫైనాన్షియర్ల వైపు మొగ్గుతున్నారు.
వివరాలు
23 ఏళ్ల తర్వాత ఆటో పర్మిట్ల మంజూరు
ఈ నేపథ్యంలోనే రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అదనంగా వసూలు చేయాలని వారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆటో పర్మిట్లను మంజూరు చేసింది. కొత్త ఆటో కొనే వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో నివాసం ఉండాలి. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఇప్పటికే తన పేరుతో ఆటో లేదన్న ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను ఆటో డీలర్ల ద్వారా ఆన్‌లైన్ విధానంలో RTA అధికారులకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
వివరాలు
ఒక్కో ఆటోపై రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు..
అయితే, ఇదే అవకాశంగా కొందరు డీలర్లు, ప్రైవేటు ఫైనాన్షియర్లు చక్రం తిప్పారు. ఒక్కో ఆటోపై రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు అదనంగా వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ అదనపు ఖర్చులను సరైన బిల్లుల్లో చూపకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆటో కొనుగోలుదారుల నుంచి హామీ పత్రాలు తీసుకుంటున్నారు. ఈఎంఐలు చెల్లించకపోతే, ఆటోను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఫైనాన్షియర్లు తెలిసిన వారి పేరుతోనే ఆటోలను చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.