New Ration Cards: కొత్త రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు.ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలనలో భాగంగా, ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తాజాగా మరోసారి దరఖాస్తులు స్వీకరించే అవకాశం కల్పించారు. కొత్తగా పెళ్లైన వారు, వేరు కుటుంబాలు ఏర్పాటు చేసిన వారు ఇలా అర్హులైన ప్రజలు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగానే గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.
రేషన్ కార్డుల విధానాలు,డిజిటల్ కార్డులపై మరో సమీక్ష
రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి సమీక్ష నిర్వహించిన తరువాత ఈ వివరాలు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రేషన్ కార్డుల విధానాలు,డిజిటల్ కార్డులపై మరో సమీక్ష జరపాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించిన అర్హుల ఎంపిక, ఆరోగ్య కార్డుల జారీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా ఉపయోగించడం వల్ల కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.