Page Loader
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టం - కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం 
కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టం - కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపడుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ హక్కు సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యే ప్రత్యేక కమిటీకి ఇది బాధ్యతగా అప్పగించారు. ఆధార్ నెంబర్, భూమి సర్వే నెంబర్లను అనుసంధానం చేసి భూ వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2ని ఈ పనుల డెడ్‌లైన్‌గా నిర్దేశించారు.

వివరాలు 

రెవెన్యూ శాఖపై సమీక్ష.. కీలక నిర్ణయాలు 

సమీప కాలంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వారసత్వ భూముల విషయంలో సెక్షన్ సర్టిఫికెట్‌ల జారీకి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 10 లక్షల లోపు విలువగల భూముల కోసం గ్రామ సచివాలయంలో కేవలం రూ.100 చెల్లించి సర్టిఫికెట్ పొందే వెసులుబాటు కల్పించనున్నారు. రూ.10 లక్షలు దాటి ఉన్న భూముల కోసం రూ.1000 చెల్లించి ఈ సర్టిఫికెట్లు పొందే అవకాశాన్ని ప్రకటించారు. అదే విధంగా కుల ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 2వ తేదీ నాటికి పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో ప్రధాన సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2నే గడువుగా నిర్ణయించారు.

వివరాలు 

రైతులకు ఉచితంగా కొత్తపాస్ బుక్స్

రైతులకు ఉచితంగా కొత్తపాస్ బుక్స్ అందజేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ హోల్డ్ భూములపై,భూ సంస్కరణల అంశాలపై సమీక్ష జరిగింది.రెవెన్యూ శాఖలో తలెత్తుతున్న సమస్యలు,అధికారుల లోపం,పనిభారం వంటి అంశాలపై ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ విభాగంలో మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ప్రతి భూమికి సంబంధించి సంపూర్ణ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కొత్తగా క్యూఆర్ కోడ్ కలిగిన పాస్ పుస్తకాలు ముద్రించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంతేగాక,భూముల రకాల్నిబట్టి వేరే వేరే రంగుల పాస్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇవి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచితంగా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే పనులను 2027డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది.