
Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఫ్యూచర్ సిటీలో మారుబెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన జపాన్ పర్యటన కొనసాగుతోంది.
మొత్తం 8 రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో, ఆయన ప్రధాన లక్ష్యం పెట్టుబడులను ఆకర్షించడం.
జపాన్‌కు చేరిన వెంటనే, అక్కడి భారత రాయబారి శింబు జార్జ్ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అధికార బృందానికి ప్రత్యేక ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు.
టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో జరిగిన ఈ విందులో తమిళనాడుకు చెందిన పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాయబారి, తమిళ ఎంపీలతో సీఎం రేవంత్ వివిధ అంశాలపై సంభాషించారు.
వివరాలు
రూ. 1,000 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్
పర్యటన మొదటి రోజే ముఖ్యమైన పెట్టుబడి ఒప్పందానికి శ్రీకారం చుట్టారు.
జపాన్‌కు చెందిన ప్రఖ్యాత కంపెనీ మారుబెనీ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ముఖ్యంగా హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఈ సంస్థ సంకల్పించింది.
టోక్యోలో మారుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి, పార్క్ ఏర్పాటుపై, పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని సీఎంఓ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 1,000 కోట్ల ప్రాథమిక పెట్టుబడిని వెచ్చించనున్నారు.
మొత్తం 600 ఎకరాల్లో ఈ పార్క్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు.
ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ప్రభుత్వ అధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధులు సీఎం సమక్షంలో సంతకాలు చేశారు.
వివరాలు
రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు
ఈ పార్క్ అభివృద్ధి ద్వారా మారుబెనీతో పాటు ఇతర బహుళజాతీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశముంది.
దాంతో, ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశముందని అంచనా.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఈ పార్క్ అభివృద్ధి కేంద్రీకరించనుంది.
విదేశీ పెట్టుబడులు రప్పించడమే కాకుండా, నైపుణ్యంతో కూడిన ఉపాధిని సృష్టించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంటుందని తెలియజేశారు.
వివరాలు
30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి పార్క్ ఇదేనని తెలిపారు.
దీని ద్వారా సుమారుగా 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని, ఇది రాష్ట్ర ప్రజల జీవనోపాధికి పెద్ద దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు.
ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మారుబెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
జపాన్-భారతదేశాల మధ్య ఉన్న మైత్రి సంబంధాల వలన, జపాన్ పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తున్నారని అన్నారు.
వివరాలు
50,000 మందికిపైగా ఉద్యోగులు
ముఖ్యమంత్రి దార్శనికతను కొనియాడిన మారుబెనీ నెక్ట్స్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా, తమ సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉందని తెలిపారు.
అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించేందుకు తమ సంస్థ ముందుండుతుందని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో మారుబెనీ సంస్థ 410కి పైగా గ్రూప్ కంపెనీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, రసాయనాలు, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్-లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ వంటి రంగాల్లో ఈ సంస్థ ప్రముఖంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికిపైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.