
NIA: ఎన్‌ఐఏ నిఘాలో దేశ వ్యతిరేక సోషల్ మీడియా పోస్టులు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం, దేశ వ్యతిరేకతకు ఊతమిచ్చే సోషల్ మీడియా పోస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన దృష్టిని మరింత కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బార్‌లకు సంబంధించిన వీడియోలపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికలపై ఇటువంటి ధోరణిలో ఉండే కంటెంట్‌ను అడ్డుకునేందుకు ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టిసారించింది. తాజాగా, ఇతర భద్రతా సంస్థలతో కలిసి ఖలిస్థానీ ఆలోచనలను ప్రచారం చేస్తున్నవారిపై, దేశ వ్యతిరేక పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
వివరాలు
దేశ వ్యతిరేక కంటెంట్‌ను నియంత్రించేందుకు త్వరలోనే కొత్త చట్టం
ఈ కార్యక్రమానికి అనుగుణంగా, రెచ్చగొట్టే స్వభావంతో ఉండే సోషల్ మీడియా పోస్టులను అడ్డుకునేందుకు దర్యాప్తు సంస్థ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని సమాచారం. అధికారవర్గాల ప్రకారం, దేశ వ్యతిరేక కంటెంట్‌ను నియంత్రించేందుకు త్వరలోనే కొత్త చట్టం రూపొందించనున్నారు. దీనిపై సోషల్ మీడియా సంస్థలకు వారి బాధ్యతల గురించి స్పష్టమైన సమాచారం అందించనున్నారు. ఆయా సంస్థలు తమ వేదికలపై వచ్చే దేశ వ్యతిరేక కంటెంట్‌పై తీసుకునే చర్యల వివరాలను ప్రభుత్వంకి కాలక్రమంలో నివేదించాల్సి ఉంటుంది. ఇంతకుముందు విదేశాలలో ఉన్నవారు చేసిన దేశ వ్యతిరేక పోస్టులపై చర్యలు తీసుకోవడం అరుదుగా జరిగేది. కాని,కొత్త చట్టం ప్రకారం విదేశీయులు పెట్టిన దేశ వ్యతిరేక పోస్టులను ఇతరులు రీపోస్ట్ చేసినా, వారిపైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
దేశంలో కుట్రలు పన్నే వ్యక్తులను,వారికి మద్దతు ఇచ్చే గుంపులను గుర్తించడమే.. ప్రధాన ఉద్దేశం
ఇప్పటికే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో ఉండే పోస్టులను బ్లాక్ చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈవిషయంలో చర్యలు నిర్ణయించేందుకు హోంమంత్రిత్వశాఖ,న్యాయ శాఖ,కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖల మధ్య ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతున్నాయని సమాచారం. దేశంలో కుట్రలు పన్నే వ్యక్తులను,వారికి మద్దతు ఇచ్చే గుంపులను గుర్తించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత,దేశంలో పాక్ గూఢచారులపై పట్టు సాధించేందుకు ఎన్‌ఐఏ తన చర్యలను మరింత వేగవంతం చేసింది. అనుమానాస్పద కదలికలు గల సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా ఇప్పటివరకు పలువురు పాక్, ఖలిస్థానీ ఉగ్రవాద మద్దతుదారులను గుర్తించి,వారిని అదుపులోకి తీసుకుంది. వారి ఖాతాల క్రియాశీలత,ఆర్థిక లావాదేవీలు,ఉగ్రసంస్థలతో ఉన్న సంబంధాలపై నిఘా ఉంచుతూ సుదీర్ఘ దర్యాప్తు కొనసాగిస్తోంది.