Page Loader
tahawwur rana: రాణా-దావూద్ సంబంధంపై ఎన్‌ఐఏ దృష్టి.. విచారణ వేగవంతం!
రాణా-దావూద్ సంబంధంపై ఎన్‌ఐఏ దృష్టి.. విచారణ వేగవంతం!

tahawwur rana: రాణా-దావూద్ సంబంధంపై ఎన్‌ఐఏ దృష్టి.. విచారణ వేగవంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై 26/11 ఉగ్రదాడుల వ్యవహారంలో కీలకమైన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తహవూర్ రాణాపై దృష్టి సారించింది. ఉగ్రదాడులకు ప్రణాళిక రచించడంలో అతడు ఇచ్చిన సహాయం, అండర్‌వర్ల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీంతో ఉన్న అనుబంధం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ముంబయి దాడుల వెనుక దావూద్ పాత్ర ఉందా అనే కోణంలోనూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాణా, ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన డేవిడ్ కోలమాన్ హెడ్లీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాణా స్వర నమూనాను సేకరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

Details

రాణా పూర్తిస్థాయిలో సహకరించలేదు

ఈ వాయిస్‌ సాంపిల్స్ ద్వారా అతడు దాడుల సమయంలో ఎవరి తో మాట్లాడాడన్న విషయాన్ని, అప్పటి కాల్ రికార్డుల ఆధారంగా ధ్రువీకరించే అవకాశం ఉంది. అయితే స్వర నమూనా కోసం నిందితుడి అనుమతి అవసరం. రాణా నిరాకరిస్తే, న్యాయస్థాన అనుమతి కోసం అధికారులు దరఖాస్తు చేయనున్నారు. రాణాను విచారిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు ముంబయి దాడులకు ప్రధాన కుట్రదారులుగా గుర్తించిన జాకిర్ రెహ్మాన్ లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్, ఇలియాస్ కశ్మీరీ, అబ్దుల్ రెహమాన్ తదితరుల గురించి ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిపారు. విచారణ మొదటి రోజున రాణా తాము అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, చాలా ఏళ్లు గడిచిపోయినందున అప్పటి ఘటనలు గుర్తుండడం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు.

Details

ఉగ్రవాది సాజిద్ మీర్‌తో రాణాకు మంచి సంబంధాలు

అయితే దాడులకు వారం రోజుల ముందు తాను ముంబయికి వచ్చానని రాణా తెలిపినట్లు సమాచారం. ఇకపోతే తహవ్వుర్ రాణా గతంలో పాకిస్థాన్ ఆర్మీ వైద్య విభాగంలో పని చేసిన అనంతరం, లష్కరే తోయిబా ఉగ్రవాదులు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సభ్యులను కలిసేటప్పుడు పాకిస్థాన్ సైనిక దుస్తులు ధరించేవాడని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. అంతేకాకుండా, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాది సాజిద్ మీర్‌తో రాణాకు మంచి సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తు ద్వారా తెలిసింది. ఈ అంశాలన్నింటిపై నిశితంగా విచారణ సాగిస్తూ, దాడుల వెనుక ఉన్న అసలు కుట్రకారులను వెలికి తీయేందుకు ఎన్‌ఐఏ నిశ్చయంగా అడుగులు వేస్తోంది.