Page Loader
గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు
గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు

వ్రాసిన వారు Stalin
Feb 21, 2023
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ నుంచి సరఫరా చేసిన ఆయుధాలను గుర్తించినట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్‌లకు చెందిన అనేక మందిని ఎన్ఐఏ ఇప్పటికే విచారించింది. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పుడు దాడులు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌పై ఇది నాలుగోసారి

గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ దాడులు చేయడం ఇది నాలుగోసారి. పంజాబ్‌లోని 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హర్యానాలోని యమునా నగర్‌లోని ముండా మజ్రా ప్రాంతంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. ఆజాద్‌నగర్‌లో ఎన్‌ఐఏ బృందంతో పాటు స్థానిక పోలీసులు కూడా దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ-గ్యాంగ్‌స్టర్ల మధ్య సంబంధంపై కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. చాలా మంది గ్యాంగ్‌స్టర్‌లను అరెస్టు చేశారు. వారిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ గ్యాంగ్‌స్టర్ల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల మధ్య సంబంధాన్ని లక్ష్యంగా చేసుకుని ఐదు రాష్ట్రాల్లోని 50కిపైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది.