
India-Pakistan: పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఇవాళ ఎన్ఐఏ ప్రాథమిక నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన ప్రాథమిక నివేదికను ఈరోజు (మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
డైరెక్టర్ జనరల్ సదానంద్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఈ నివేదికను సిద్ధం చేశారు.
దాదాపు 150 మంది ఇచ్చిన సాక్ష్యాలు, దాడి జరిగిన విధానాన్ని త్రీడీ ఆధారంగా పునఃసృష్టించిన దృశ్యాలు, ఘటన స్థలంలో లభించిన ఆయుధాలు, ఇతర కీలక ఆధారాలు ఈ నివేదికలో పొందుపరిచారు.
ఇంతవరకూ దాదాపు 90 మంది ఓవర్‌గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేశారు. సుమారు 3,000 మందిని విచారించిన ఎన్‌ఐఏ, 100కి పైగా ప్రాంతాల్లో బలగాల సాయంతో సోదాలు నిర్వహించింది.
Details
బైసరన్‌ను సందర్శించిన డీజీ సదానంద్
దర్యాప్తు పురోగతిని స్వయంగా సమీక్షించేందుకు డీజీ సదానంద్ పహల్గాంలోని బైసరన్‌ను సందర్శించారు.
ఇదిలా ఉండగా, మరింత లోతైన ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో సాక్ష్యాలు సేకరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఎన్‌ఐఏ, మరికొంత మంది సాక్షులను కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
పాత ఉగ్రవాదులను కూడా ప్రశ్నించి, పహల్గాం దాడిలో వారికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
దాడిలో ఉగ్రవాదులకు సహకరించిన 20 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సమాచారం.