LOADING...
Nimisha Priya: యెమెన్‌ కీలక నిర్ణయం.. భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!
యెమెన్‌ కీలక నిర్ణయం.. భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!

Nimisha Priya: యెమెన్‌ కీలక నిర్ణయం.. భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
06:24 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమెకు విధించిన మరణశిక్షను యెమెన్ అధికారులు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఈ ప్రకటనను భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత నాయకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం విడుదల చేసింది. అయితే ఇప్పటికీ భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర యెమెన్ అధికారులుతో పాటు అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు కూడా హాజరయ్యారని సమాచారం.

వివరాలు 

షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ప్రత్యేక చర్చల బృందం నియామకం 

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు అనేక దౌత్య, మతపరమైన ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు, యెమెన్‌లో ప్రముఖ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ప్రత్యేక చర్చల బృందాన్ని నియమించారు. మరోవైపు అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా కూడా చొరవ చూపించారు. ఈ చర్చలు సఫలమవడంతో యెమెన్ అధికారులు ఉరిశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధృవీకరించారు. మతపండితుల గట్టి ప్రయత్నాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

వివరాలు 

భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో సుదీర్ఘ చర్చలు

అయితే, నిమిష ప్రియను జైలు నుంచి విడుదల చేస్తారా లేక జీవిత ఖైదు విధిస్తారా అన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం ఆమె భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతంలో, యెమెన్‌కు చెందిన తలాల్ మహదీ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించారు. అయితే బాధిత కుటుంబంతో నిమిష తరఫు వారు పరస్పర అవగాహనకు రావాలన్న ప్రయత్నాల నేపథ్యంలో భారత ప్రభుత్వం యెమెన్ అధికారులను మరింత సమయం ఇవ్వాలని కోరింది. దీంతో జులై 16న అమలవ్వాల్సిన ఉరిశిక్షను వాయిదా వేశారు. అప్పటి నుంచీ భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరుపుతూనే ఉంది.