Page Loader
తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు
ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు

తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 17, 2023
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ఏదైనా మాట్లాడే ముందు, రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతను గ్రహించి మాట్లాడాలని ఉదయనిధికి సూచించారు. 1971లో తమిళనాడులో శ్రీరాముడ్ని అవమానించినా, సనాతన ధర్మం హింసాత్మక చర్యలకు పాల్పడలేదని ఆమె గుర్తు చేశారు. సనాతన ధర్మంపై ఉదయ్ వ్యాఖ్యలకు ఎలాంటి స్పందన రాకూడదని భావించరాదని, ఒకవేళ భావిస్తే అది తప్పే అవుతుందని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే ఉదయ ఈ చర్చకు తెర తీశారా అని నిర్మలా అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికీ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని, అయితే మంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు.

DETAILS

మాట్లాలనుకుంటే మాట్లాడండి కానీ, హింసను ప్రేరేపించేలా మాట్లాడకూడదు : నిర్మలా 

హింసను ప్రేరేపించే పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదని నిర్మలా హితబోధ చేశారు. సనాతన ధర్మంపై డీఎంకే 100 ఏళ్ల పాటు మాట్లాడుతుందని ఉదయనిధి మాట్లాడిన మాటలపై నిర్మలా స్పందించారు. దానిపై 100 ఏళ్లు మాట్లాలనుకుంటే మాట్లాడండి కానీ, హింసను ప్రేరేపించేలా మాట్లాడకూడదని గట్టిగా సూచించారు. శ్రీరాముడి ఫోటోకి చెప్పుల దండ వేసి ఊరేగించిన తమిళగడ్డపై పెరిగానని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ సంఘటన తనను బాధిస్తుందన్నారు. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను విధానాన్ని తాము అమలు చేయట్లేదని సున్నితంగా హెచ్చరించారు. ఇదే సనాతన ధర్మమని వివరించారు. ఒకవేళ ఇతర మతస్థులే లక్ష్యంగా తాము అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఏం జరిగి ఉండేదో అందరికీ తెలిసిందేనన్నారు.