Nitin Gadkari: మోదీ కాదని నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు, తరువాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుండి ప్రతిపాదనలు వచ్చినట్టు గడ్కరీ తెలిపారు. ప్రతిపక్షాలు తనకు మద్దుతు ఇస్తామని చెప్పారని అన్నారు. తద్వారా ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో, గడ్కరీ మాట్లాడుతూ, "మోదీ బదులు నన్ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రతిపక్షాలు ప్రతిపాదనలు చేసాయి. లోక్‌సభ ఎన్నికల ముందు, తర్వాత కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. మోదీ బదులుగా నేను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం అంటే బీజేపీలో చీలిక సృష్టించాలనే ప్రతిపక్షాల పథకం" అని పేర్కొన్నారు.
నేను మొదటగా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిని: గడ్కరీ
మోదీ పాలనలో తన బాధ్యతలతో తృప్తిగా ఉన్నానని, తనకు ప్రధాని కావాలనే కోరిక లేదని, ఆ పదవిపై ప్రత్యేక ఆసక్తి కూడా లేదని గడ్కరీ తెలిపారు. "నేను మొదటగా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిని, బీజేపీ కార్యకర్తను. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా, నేను నిబద్దత కలిగిన కార్యకర్తగా పనిచేస్తాను" అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే,ప్రస్తుత బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు కేంద్ర మంత్రి పదవులకి అనర్హులవుతున్న నేపథ్యంలో, మోదీ వయస్సు 74 సంవత్సరాలు కావడం వల్ల ఈ నియమం ఆయనకి వర్తిస్తుందా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికి, గడ్కరీ 67 సంవత్సరాలు కలిగి ఉండగా, ఆయనను ప్రధాని స్థానం ఇవ్వాలని పలువురు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.