బిహార్‌లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న సర్వేను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుల ఆధారిత సర్వేను సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ పార్థ సారథిలతో కూడిన ధర్మాసనం విచారించింది, తీర్పు వెలువరించింది. వాస్తవానికి రెండు దశల్లో సర్వే చేయాలని నితీష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో భాగంగా ఇంటి లెక్కింపు ప్రక్రియను నిర్వహించింది. రెండో దశ సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమైంది. ప్రజల కుల, సామాజిక-ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన డేటాను సేకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అంతకు ముందు ఏం జరిగందంటే?
వాస్తవానికి రెండో దశ సర్వేను ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 4న కుల గణనపై హైకోర్టు స్టే విధించింది. బిహార్‌లో సర్వేపై స్టే విధించాలని దాఖలైన మూడు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు స్టే విధించింది. స్టే విధించిన సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సర్వే వాస్తవానికి జనాభా గణన అని, దీనిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వహించగలదని పేర్కొంది. సర్వేపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో మంగళవారం విచారించిన పాట్నా హైకోర్టు, ఆ మూడు పిటిషన్లను కొట్టివేసి, సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.