
Boeing Fuel System: బోయింగ్ 787 ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదు : అమెరికా FAA చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (US FAA) స్పష్టంచేసింది. ఎయిర్ ఇండియా ఎఐ 171 విమానానికి సంబంధించిన ప్రమాదం నేపథ్యంలో గురువారం ఈ ప్రకటన విడుదల చేశారు. ఎఫ్‌ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రెయాన్ బెడ్‌ఫోర్డ్ మాట్లాడుతూ ఈ ఘటనను యాంత్రిక సమస్య లేదా ఆకస్మికంగా ఇంధన నియంత్రణ స్విచ్‌లలో మార్పులు జరిగినదిగా తాము భావించడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన విస్కాన్సిన్‌లో నిర్వహించిన ఎయిర్‌షో సందర్భంగా వెల్లడించారు.
వివరాలు
పైలట్‌లు మాన్యువల్ మార్గంలో స్విచ్‌లను ఆపే అవకాశం
''బోయింగ్ విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు యాంత్రికంగా విఫలమయ్యాయని చెప్పలేం. ఈ విషయంలో మాకు పూర్తి నమ్మకముంది. FAA అధికారులు స్వయంగా ఆ స్విచ్ యూనిట్లను విమానంపై అమర్చి పరీక్షలు చేశారు. వాటి పనితీరులో గానీ, ఇంధన సరఫరా వ్యవస్థలో గానీ ఎలాంటి లోపాలు గుర్తించలేదు'' అని బ్రెయాన్ పేర్కొన్నారు. అయితే, బోయింగ్ సంస్థతో పాటు ఎయిరిండియా సంస్థలు ఈ వ్యాఖ్యలపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు. సాధారణంగా విమానం నేలపై ఉన్నప్పుడు మాత్రమే ఇంధన స్విచ్‌లను షట్‌డౌన్ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే విమానం గాల్లో ఉన్నపుడే ఇంజిన్ వైఫల్యం వస్తే, అప్పటి పరిస్థితుల్లో పైలట్‌లు మాన్యువల్ మార్గంలో స్విచ్‌లను ఆపే అవకాశముంటుంది.
వివరాలు
"రన్" స్థితి నుంచి "కట్‌ఆఫ్" స్థితికి..
ఇక మరోవైపు, ఎయిరిండియా కూడా జాగ్రత్త చర్యగా ఇటీవల తమకు చెందిన బోయింగ్ 787, 737 విమానాల్లోని ఇంధన స్విచ్‌లు సహా కొన్ని ముఖ్య భాగాలను సమగ్రంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో ఎటువంటి లోపాలు కనబడలేదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విమానం టేకాఫ్ అయిన వెంటనే, కేవలం క్షణాల వ్యవధిలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు "రన్" స్థితి నుంచి "కట్‌ఆఫ్" స్థితికి మారిపోయినట్లు గుర్తించారు.