Tirupati: డిసెంబర్ 15 నుంచి తిరుపతిలో 'నో హెల్మెట్ - నో పెట్రోల్' అమలు.. కఠినంగా అమలు!
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించరాదని పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి 'నో హెల్మెట్ - నో పెట్రోల్' నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరుగుతున్న మరణాలను తగ్గించే లక్ష్యంతో జిల్లా పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. జాతీయ రోడ్డు భద్రత గణాంకాలను ప్రస్తావించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, మొత్తం ప్రమాద మరణాల్లో సుమారు 45 శాతం ద్విచక్ర వాహనాలే కారణమవుతుండటం ఆందోళన కలిగించే విషయం అన్నారు. అతివేగంగా వాహనాలు నడపడం, అలాగే హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని వివరించారు.
వివరాలు
అవగాహన పెంచేందుకు తిరుపతి జిల్లా అంతటా పెద్ద స్థాయిలో ప్రచార కార్యక్రమాలు
వాహనం నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్‌ను తప్పనిసరిగా సరైన విధంగా ధరిస్తే దాదాపు 40 శాతం మరణాలను నివారించవచ్చని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగితే బాధిత కుటుంబాలపై మానసిక వేదన మాత్రమే కాకుండా తీవ్రమైన ఆర్థిక భారం కూడా పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు తిరుపతి జిల్లా అంతటా పెద్ద స్థాయిలో ప్రచార కార్యక్రమాలను పోలీసులు ప్రారంభించారు. డిసెంబర్ 15 వరకు ఇవి కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఈ కొత్త నిబంధనను అర్థం చేసుకుని పాటించేందుకు కావాల్సిన సమయాన్ని ఇస్తున్నామని చెప్పారు. అయితే ఆ తర్వాత హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు.
వివరాలు
గణనీయంగా పెరుగుతున్న ఏపీలో రోడ్డు ప్రమాదాలు
ఈ నిర్ణయం అమలుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ముందుగానే సమాచారం అందించామని పోలీసు అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయకూడదని సూచిస్తూ, ఈ చర్యల అమలులో పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని బంకుల యజమానులను కోరారు. ఇదిలా ఉండగా, ఏపీలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది నవంబర్ 5 వరకు రాష్ట్రంలో సగటున రోజుకు దాదాపు 50 ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిలో 23 మంది ప్రాణాలు కోల్పోతుండగా 53 మంది వరకు గాయపడుతున్నారు. ప్రధానంగా వాహనాలను అధిక వేగంతో నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఈ జిల్లాలను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 'క్రిటికల్ డిస్ట్రిక్ట్స్'గా గుర్తించింది
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాలను కేంద్ర రోడ్డు రవాణా - జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 'క్రిటికల్ డిస్ట్రిక్ట్స్'గా గుర్తించింది. మరోవైపు, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రమే సుమారు 400 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 200 మందిలోపు మరణాలు నమోదైన జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నట్టు సర్కారు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.