
Jaishankar: భారత్, చైనా చర్చల్లో మూడో పక్షానికి అవకాశం లేదు: జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చైనా పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-చైనా సంబంధాలకు సంబంధించి ఏ విషయంలోనైనా మూడో పక్షం (పాక్‌ను ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకునే అవకాశం లేదని ఆయన స్పష్టంగా తెలిపారు. గత సంవత్సరం అక్టోబరులో చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు డెస్పాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో భారత బలగాల పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించినందుకు జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ఒక స్థిరమైన, స్పష్టమైన సరిహద్దు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
టియాంజిన్ నగరానికి జైశంకర్
గల్వాన్‌లో ఘర్షణలు జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత ఇరుదేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదని జైశంకర్ ఈ సందర్భంగా సూచించారు. చైనా పొలిట్‌బ్యూరో సభ్యుడు వాంగ్ యీతో జరిగిన చర్చల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్య సరఫరాలు ఆపకుండా కొనసాగించాల్సిన అవసరాన్ని,ఎగుమతులపై ఆంక్షలు విధించకూడదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా జైశంకర్ టియాంజిన్ నగరానికి వెళ్లారు. అక్కడ జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వివరాలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిసిన జై శంకర్
పర్యటన సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కూడా కలిసినట్టు సమాచారం. ఇరుదేశాల మధ్య తాజా పరిణామాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 2020 గల్వాన్ సంఘటన తర్వాత భారత్-చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా, గత జూన్‌లో చైనా క్వింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రుల సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరైన విషయం విదితమే.