Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది నవంబర్‌లో ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ "షాహీ జామా మసీదు" మరోసారి వార్తల్లో నిలిచింది.
రంజాన్‌కు ముందుగా మసీదును పునరుద్ధరించేందుకు జామా మసీదు యాజమాన్యం పురావస్తు శాఖ (ASI) అనుమతి కోరింది.
అయితే, ఈ అభ్యర్థన జరిగిన మరుసటి రోజే, సంభాల్ జిల్లా అధికార యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.
మసీదును శుభ్రం చేయడం, పెయింట్ చేయడం, అలంకరించడం కోసం అనుమతి కోరుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి లేఖ రాసిన విషయాన్ని షాహీ జామా మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీ ఆదివారం మీడియాతో వెల్లడించారు.
వివరాలు
నిర్ణయం ఏఎస్ఐదే..
ఈ లేఖపై స్పందించిన సంభాల్ జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా మాట్లాడుతూ, ఈ అంశం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందని, ఈ ప్రదేశం ఏఎస్ఐ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.
మసీదులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయంపై ఏఎస్ఐ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని, అనుమతి లభించే వరకు ఎవరూ పనులు చేయరాదని ఆయన తెలిపారు.
అంతేకాక, ఈ వివాదాస్పద కట్టడానికి రంగులు వేయాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని, అయినప్పటికీ నిర్ణయం ఏఎస్ఐదేనని స్పష్టంచేశారు.
వివరాలు
మందిరాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్
మొఘల్ కాలంలో నిర్మితమైన ఈ మసీదు, ఒకప్పటి హిందూ ఆలయమైన హరిహర్ మందిరాన్ని ధ్వంసం చేసి కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ జరిపేందుకు గత ఏడాది నవంబర్‌లో కోర్టు సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించింది.
అయితే, అధికారులు సర్వే కోసం వెళ్లిన సమయంలో, అక్కడి ముస్లిం సమూహం వారికి అడ్డుగా నిలిచింది.
ఈ ఉద్రిక్తతల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మంది పైగా పోలీసులు గాయపడ్డారు.