సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్
సంచలనం సృష్టించిన పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా, భారతదేశానికి చెందిన సచిన్ ప్రేమ, పెళ్లి బంధంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఈ జంట వివాహం చేసుకునేందుకు నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. తొలుత సీమాను అదుపులోకి తీసుకుని విచారించిన నోయిడా పోలీసులు, ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన పుష్పేంద్ర, పవన్‌గా గుర్తించారు. అనంతరం వారి నుంచి పెద్ద మొత్తంలో 15 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుని విచారిస్తునమన్నారు. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తులకు నకిలీ పత్రాల తయారీ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
సీమా వ్యవహారంపై మరింత లోతుగా పోలీసుల దర్యాప్తు
కొవిడ్ సమయంలో ఆన్లైన్ గేమ్(PUBG) ఆడుతున్న క్రమంలో నోయిడాలోని రబుపురాకు చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడిందని సీమా గతంలోనే వెల్లడించింది. అనంతరం ప్రేమకు దారితీసినట్లు పాక్ మహిళ సీమా హైదర్ (30) పేర్కొంది. పాకిస్థాన్ వాసి గులాం హైదర్ ను పెళ్లి చేసుకున్న సీమా నలుగురు పిల్లలను కలిగి ఉంది. ప్రియుడు సచిన్‌తో కలిసి జీవించేందుకు పాక్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడింది. మే 13న తన పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టింది. భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ కారణంగా సీమాను, ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను జులై 4న పోలీసులు అరెస్ట్ చేశారు. సీమా పాకిస్థాన్ గూఢచారి కావచ్చనే అనుమానంతో పోలీసులు(ATS) మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.