వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది. మరోవైపు అధికార వైసీపీ శ్రేణులూ ప్రతి దాడి చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ రాళ్లు, కర్రలతో రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన శ్రేణులు దాడులకు ఒడిగట్టారు. ఎంతకీ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా పరిస్థితులు పూర్వస్థితికి రాలేదు.
సుమారు 15 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం
తమపై అక్రమ కేసులు పెట్టారంటూ తెలుగుదేశం చేపట్టిన ర్యాలీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ క్యాడర్ రాళ్లతో దాడి చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై దాడి జరగడాన్ని వైసీపీ ఖండిస్తూ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే వినుకొండలో పరిస్థితులు దిగజారిపోయి వినుకొండ రాజకీయ రణరంగంగా మారింది. ఘటనలో ఇరు వర్గాలకు చెందిన సుమారు 15 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. ఈ మేరకు శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఇంటర్నెట్ (అంతర్జాల సేవలు)ను నిలుపుదల చేయడం గమనార్హం.