
సీమా హైదర్ కేసులో సంచలనాలు.. విచారణలో నమ్మలేని విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ దేశస్తురాలు సీమా హైదర్ కేసులో సంచలన విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఈ మేరకు ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ ) అధికారుల విచారణలో విస్తుబోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ మేరకు సీమా పాక్ గూఢచారి కావొచ్చని స్పెషల్ పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలకు సీమా హైదర్ తెలివిగా సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం.
ఇదే క్రమంలో యూపీకి చెందిన సచిన్ మీనాతో సీమా పరిచయం, ప్రేమ, తర్వాత పెళ్లి అంతా ఓ కట్టుకథగా భావిస్తున్నారు. పబ్జీ గేమ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి ఏకంగా దేశ సరిహద్దులనే దాటి వచ్చింది సీమా గులాం హెదర్.
DETAILS
పాక్ ఆర్మీలో పనిచేస్తున్న సీమా హైదర్ చిన్నాన్న, ఆమె సోదరుడు
పాక్ మహిళ సీమాను ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తోంది. సీమా హైదర్ చిన్నాన్న, ఆమె సోదరుడు పాక్ ఆర్మీలో పని చేస్తున్నారని మంగళవారం రెండో రోజు విచారణలో అధికారులు నిర్థారించారు.
సచిన్ మీనాను కలిసేందుకు ముందే దిల్లీలో సీమా కొంతమందిని కలిశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆమెకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని లక్నోలో ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశాకే తాజా పరిణామాలు జరగడం గమనార్హం. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సదరు అనుమానితుడు సరిహద్దులో పంచుకున్నట్లు తెలుస్తోంది.
విచారణలో ఐదో తరగతి వరకే చదువుకున్నట్లు చెప్పిన సీమా, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆవిడతో నిజాలు చెప్పించడం అంత సులువు కాదని భావిస్తున్నారు.
DETAILS
సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమ ప్రవేశం
గత కొన్ని రోజులుగా సీమాను పాకిస్థాన్ కే పంపించాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు వార్నింగ్ కాల్ చేయడం తెలిసిందే. ఈ బెదిరింపు ఫోన్లపైనా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
మరోవైపు తాను హిందువుగా మారానని, సచిన్‌తోనే కలిసి జీవిస్తానని సీమా అంటోంది. ఈ మేరకు పాక్ వెళ్లే ఆలోచనే లేదని గతంలోనే స్పష్టం చేసింది. ఆమెను తిరిగి పాక్ పంపాలంటూ భర్త గులాం హైదర్ ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు.
భర్తను వదిలేసి తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి సీమా ప్రవేశించారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన మీనాతో పాటు అతని తండ్రిని ఈనెల 4న నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిలుపై బయటకి వచ్చారు.