J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో పూంచ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం, రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులు జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ పేర్కొంది. పూంచ్‌లోని సింధారా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు సోమవారం రాత్రి 11.30 గంటలకు భారత సైన్యానికి తారసపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసిన సైన్యం రాత్రి పూట ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు డ్రోన్‌లను మోహరించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెల్లవారుజామున భారత సైన్యం- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హతమైన వారు విదేశీ ఉగ్రవాదులేనని, వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.