Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు
కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరకేంగా ప్రతిపక్షాలు బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. రెండోరోజు సమావేశానికి 26రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే ఇదే మంగళవారం రోజున ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని బీజేపీ దిల్లీలో నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి 38పార్టీలు హాజరవుతాయని బీజేపీ తెలిపింది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీగా నిర్వహిస్తున్నఈ సమావేశాలు దేశ రాజకీయాలపై, 2024ఎన్నికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి. విచిత్రం ఏంటంటే 545మంది సభ్యులున్న లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల కూటముల్లోని మొత్తం 64పార్టీల్లో కేవలం 9పార్టీలకు మాత్రమే 10లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. లోక్‌సభలో ఈ తొమ్మిది పార్టీల సభ్యుల సంఖ్య 479కావడం గమనార్హం. ప్రతిపక్ష కూటమిలో అయితే చాలా పార్టీలకు లోక్‌సభలో అసలు ప్రాతినిధ్యమే లేదు.
నేడు ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు
బెంగుళూరులో సోమవారం జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలు కీలక అంశాలపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండోరోజు సమావేశానికి హాజరవుతున్నాయి. రెండో రోజు చర్చల్లో కూటమి పేరును ఖరారు చేయనున్నారు. అలాగే కామన్ మినిమమ్ ప్రోగామ్‌ను కూడా నిర్ణయించనున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా మంగళవారం ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 'యునైటెడ్ వి స్టాండ్' నినాదంతో ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.
24నుంచి 38కి పెరిగిన ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య
1998లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య 24 ఉంటే, ఇప్పుడు 38కి పెరిగింది. ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి ప్రజాదరణకు నిదర్శనమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐడీఎంకే), తమిళ మనీలా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ (థామస్), భరత్ ధర్మ జన సేన వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఎన్‌డీయే మిత్ర పక్షాల సమావేశం గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, రూ.20లక్షల కోట్లకు పైగా అనినీతి కేసుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు.