Unseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి
ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, నైరుతి మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు రాబోయే రెండురోజుల పాటు ఐఎండీ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పైన పేర్కొన్న ఉరుములు, ఈదురు గాలులతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాల అంచనా నేపథ్యంలో దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్రకు ఆరెంజ్ అలర్ట్, నైరుతి మధ్యప్రదేశ్‌కు రెడ్ అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది.
గుజరాత్‌ను వణికించిన వడగళ్ల వానలు
గుజరాత్‌లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన వడగళ్ల వానలతో పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) అధికారి తెలిపారు. అకాల వర్షాలు ఆదివారం గుజరాత్‌లోని దాదాపు అన్ని ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ క్రమంలో పిడుగుపాటుకు కొన్ని మనుషులే కాకుండా పశువులు, గొర్రెలు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో దాహోద్ జిల్లాలో నాలుగు, బరూచ్‌లో మూడు, తాపీలో రెండు, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంత, బోటాడ్, ఖేదా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నారు. గుజరాత్‌లో వర్షాలు సోమవారం తగ్గుముఖం పడుతాయని ఐఎండీ పేర్కొంది.
గుజరాత్‌లోని 234 తాలూకాల్లో వర్షాలు
ఈశాన్య అరేబియా సముద్రం, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల సమీపంలో ఏర్పడిన తుఫాను కారణంగా గుజరాత్‌లో వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో సోమవారం తేలికపాటి వర్ష సూచనలతో పాటు, రాష్ట్రంలో మంగళవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్‌లోని 252 తాలూకాల్లోని 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైంది. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, మోర్బీలో వడగళ్ల వానలు కురిశాయి. గుజరాత్‌లో సంభవించిన మరణాలపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.