RSS Chief: డిక్టేషన్ కాదు.. డిస్కషన్ కావాలి.. పేపర్ లీక్ ఆందోళనల వేళ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ యువత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేటి తరం ప్రశ్నించే తరం అని, వారికి ఆదేశాలు ఇవ్వడం కంటే చర్చించి అర్థం చెప్పడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. 'సమకాలీన మాతృత్వం' కార్యక్రమంలో ప్రసంగం ఢిల్లీలో నిర్వహించిన 'సమకాలీన మాతృత్వం' అంశంపై జాతీయ అవగాహన సమావేశంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ చిన్నతనంలో పెద్దలు చెప్పిన మాటలను ప్రశ్నించకుండా వినేవాళ్లమని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, నేటి యువత ప్రతి విషయాన్నీ ప్రశ్నిస్తోందని అన్నారు.
వివరాలు
కారణాలు వివరించి నమ్మకం కల్పించాలి
యువతకు ఏ విషయమైనా ఆదేశాల రూపంలో చెప్పడం కంటే, దాని వెనుక ఉన్న కారణాలను వివరించి వారిలో నమ్మకం కల్పించాలని భగవత్ సూచించారు. వారితో ఎక్కువ సమయం గడపాలని, ప్రేమ, ఆప్యాయతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
యువతతో ఎలా వ్యవహరించాలనే అంశంపై మోహన్ భగవత్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. డిక్టేషన్ కాదు.. డిస్కషన్ కావాలి. ఆదేశాలు కాదు.. పరస్పర అంగీకారం ముఖ్యమంటూ యువతతో సంభాషణే సరైన మార్గమని చెప్పారు.
వారిని అర్థం చేసుకుని, చర్చల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
వివరాలు
విద్యార్థుల నిరసనల వేళ ప్రాధాన్యం సంతరించుకున్న వ్యాఖ్యలు
తన ప్రసంగంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలను మోహన్ భగవత్ నేరుగా ప్రస్తావించలేదు.
అయినప్పటికీ దేశంలో పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదే సమయంలో సీజేపీ ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు కొనసాగుతుండటంతో ఈ వ్యాఖ్యలు రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.