CM Revanth Reddy: వివాదాలు కాదు.. పరిష్కారమే కావాలి.. జల వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీళ్ల సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, కోర్టులకెక్కకుండా మన సమస్యలను మనమే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, జల వివాదాలపై మాట్లాడారు. నీళ్ల సమస్యపై రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. ''పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతాను.
Details
సమస్యలను సమరస్యంగా పరిష్కరించుకోవాలి
వివాదాలు కావాలా.. పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కావాలని చెబుతాను. మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకుందాం అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్ర కాలంలో కృష్ణా నదిపై నిర్మితమైన ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని కోరారు. అనుమతులు లభించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా పోతున్నాయని, దాంతో రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు.
Details
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
'మేం వివాదాలు కోరుకోవడం లేదు.. పరిష్కారమే కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. ప్రజల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పొరుగున ఉన్న రాష్ట్రాల సహకారం తప్పనిసరి. రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా ఏ రాష్ట్రంతోనైనా వివాదాలు కోరుకోవడం లేదని సీఎం తెలిపారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే, తెలంగాణ ప్రభుత్వం పది అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
Details
ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుజెన్ మెడికేర్ వంటి సంస్థలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. పెట్టుబడులకు లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని, ప్రపంచ స్థాయి దేశాలతో తెలంగాణ పోటీపడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందని, అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు సీఈవోలుగా మన దేశానికి చెందిన వారే ఉన్నారన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.