
MEA: పాకిస్తాన్‌కి అణు బెదిరింపులు అలవాటే.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన అణు యుద్ధ హెచ్చరికపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం ఘాటుగా స్పందించింది. "పాకిస్తాన్‌కు అణు బెదిరింపులు చేయడం పాత అలవాటే. అదీ కూడా ఒక మూడో స్నేహపూర్వక దేశం భూభాగం నుంచే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం" అని పేర్కొన్నారు. అణు నియంత్రణ, పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గుంపులతో ఉన్న సంబంధాలపై అంతర్జాతీయ సమాజం తగిన నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. భారత్ ఎప్పటికీ "అణు బ్లాక్‌మెయిల్‌కు తలవంచదు" అని, దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వివరాలు
'బాధ్యతారహిత అణు దేశం'
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం,టాంపాలో పాకిస్తానీ ప్రవాసుల సభలో ఆసిం మునీర్ చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ ఒక బాధ్యతారహిత అణు దేశమని మరోసారి రుజువు చేశాయి. "తాము నాశనమైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశారు". ఆసిం మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం బలహీనమైందని,సైన్యం ఆధిపత్యం ఎక్కువగా ఉందని చూపిస్తున్నాయని వర్గాలు అభిప్రాయపడ్డాయి. అమెరికా మద్దతు లభించినప్పుడల్లా పాకిస్తాన్ సైన్యం దూకుడు చూపుతుందని పేర్కొన్నాయి. "అమెరికా పర్యటనలో వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆతిథ్యం చూసి, ఆసిం మునీర్ వచ్చే అడుగు పాకిస్తాన్‌లో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిగా మారతాడేమో" అని వ్యాఖ్యానించింది.
వివరాలు
అణు-కాశ్మీర్ వివాదాలు
కాశ్మీర్ అంశంపై కూడా ఆసిం మునీర్ తన దేశం పాత యాంటీ-ఇండియా వైఖరిని పునరుద్ఘాటించాడు. కాశ్మీర్‌ను పాకిస్తాన్ "జుగులర్ వేన్" అని పిలుస్తూ, భారత్‌తో భవిష్యత్ ఘర్షణలో అణు ప్రతీకారం ఉంటుందని హెచ్చరించాడు. ఇలాంటి వ్యాఖ్యలను న్యూఢిల్లీ గతంలోనే ఖండించింది.