Metro Alignment : పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు.. నిర్మాణ వ్యయం తగ్గించేలా కొత్త డిజైన్లు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిపాదిత మెట్రో రైలు కారిడార్-6కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మెట్రో అలైన్‌మెంట్, డిజైన్లలో స్వల్ప మార్పులు చేయాలని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) నిర్ణయించింది. గతంలో కొన్ని క్లిష్టమైన ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ సాధ్యం కాదనే అంచనాతో అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే ఆయా ఆస్తుల యాజమానులతో చర్చలు జరిపిన మెట్రోరైలు సంస్థ.. ఇటీవల వాటిని సైతం స్వాధీనం చేసుకుంది. దీంతో తక్కువ వ్యయంతో ప్రస్తుత అలైన్‌మెంట్‌ను మరింత మెరుగ్గా పునఃరూపకల్పన చేసే అవకాశం ఏర్పడింది.
వివరాలు
అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగించేలా మార్పులు
ఈ నేపథ్యంలో అలైన్‌మెంట్ ఆప్టిమైజేషన్ బాధ్యతలను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించి సీల్డ్ కొటేషన్లు కోరుతూ హెచ్‌ఏఎంఎల్ ఇటీవల ప్రకటన జారీ చేసింది.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌లో 30కిపైగా పోర్టల్స్‌ను ప్రతిపాదించారు.
రహదారి విభాగంలో స్తంభాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాని ప్రాంతాలు, మలుపులు ఉన్న చోట్ల ఈ పోర్టల్స్‌ను నిర్మించాలని డిజైన్‌లో పేర్కొన్నారు.
వీటి కారణంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆప్టిమైజేషన్ టెండర్ దక్కించుకునే సంస్థ ప్రస్తుత అలైన్‌మెంట్‌ను పరిశీలించి, కొత్త ప్రణాళికలు రూపొందించనుంది.
నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగించేలా మార్పులు సూచించనుంది.
వివరాలు
ఏం చేయబోతున్నారు?
మెట్రో నిర్మాణంలో ఉపయోగించే పిల్లర్ పోర్టల్స్ సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించే మార్గాలను సూచించనున్నారు.
మెట్రో కారిడార్ సెంటర్ లైన్‌ను సాధ్యమైనంత వరకు ప్రస్తుత రహదారి సెంటర్ లైన్‌కు అనుగుణంగా ఉండేలా చూడనున్నారు.
చారిత్రక, సున్నితమైన కట్టడాలకు సమీపంలో మెట్రో నిర్మాణాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిఫార్సు చేయనున్నారు.
జీసీ టెండర్ల గడువు పొడిగింపు
పాతబస్తీ మెట్రో కారిడార్‌తో పాటు మరో నాలుగు కారిడార్ల జనరల్ కన్సల్టెన్సీ (జీసీ) టెండర్ల గడువు పొడిగించారు.
తొలుత ఈ నెల 24తో గడువు ముగియాల్సి ఉండగా.. తాజాగా అక్టోబరు 8 వరకు అవకాశం కల్పించారు.
వివరాలు
కారిడార్-6 వివరాలు
కారిడార్ దూరం: 7.5 కి.మీ.
స్టేషన్లు: 6
మార్గం: ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు
ప్రతిపాదిత స్టేషన్లు: సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, అలియాబాద్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట
స్టేషన్ల మధ్య దూరం: 1.2 కి.మీ.
ప్రాజెక్ట్ అంచనా వ్యయం: రూ.2,935 కోట్లు