LOADING...
Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్.. 93% భూసేకరణ పూర్తి, రహదారి విస్తరణ పనులు ప్రారంభం..!
93% భూసేకరణ పూర్తి, రహదారి విస్తరణ పనులు ప్రారంభం..!

Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్.. 93% భూసేకరణ పూర్తి, రహదారి విస్తరణ పనులు ప్రారంభం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ పాతబస్తీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు అమలులో కీలక పురోగతి నమోదైంది. మెట్రో రెండో దశలో భాగంగా చేపట్టిన పాతబస్తీ మెట్రో మార్గానికి సంబంధించిన భూసేకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం సేకరించాల్సిన 888 ఆస్తుల్లో ఇప్పటికే 825 ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, ఇది దాదాపు 93 శాతానికి సమానమని హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు వెల్లడించారు. భూసేకరణలో భాగంగా తమ ఆస్తులు కోల్పోయిన బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.820 కోట్ల మేర పరిహారం చెల్లించింది. పరిహారం పొందిన ప్రాంతాల్లో ఇప్పటికే ఆస్తుల స్వాధీనం, కూల్చివేతల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

వివరాలు 

వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ పరిశీలనలో మూడు పురాతన నిర్మాణాల అంశం

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ మెట్రో మార్గం దారుల్‌షిఫా, పురానీహవేలీ, అలీజా కోట్ల, హరిబౌలి, షాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు విస్తరించనుంది. పాతబస్తీ చారిత్రక వైభవానికి ప్రతీకలైన ఈ మార్గంలో దాదాపు 105 మతపరమైన, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు ఉండటంతో వాటికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సేకరించాల్సిన 7 శాతం ఆస్తుల్లో భాగంగా మూడు పురాతన నిర్మాణాల అంశం ప్రస్తుతం వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. వాటిపై నిర్ణయం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

వివరాలు 

మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన కొన్ని భూములు వక్ఫ్ ఆస్తులుగా ఉండటంతో వివాదం

అయితే కొన్ని ఆస్తుల విషయంలో చట్టపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 ఆస్తులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉండగా, మరికొన్ని భూ వివాదాలు ప్రధాన భూ పరిపాలన కమిషనర్ పరిధిలోని భూసేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్ అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన కొన్ని భూములు వక్ఫ్ ఆస్తులుగా ఉండటంతో వివాదం తలెత్తింది. తాము కొనుగోలు చేసిన సమయంలో అవి వక్ఫ్ భూములని తెలియదని ప్రస్తుత యజమానులు చెబుతున్నారు. మెట్రో అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధితులు సంబంధిత అథారిటీని ఆశ్రయించారు. ఈ వివాదాస్పద భూములు మినహా మిగిలిన వ్యక్తిగత ఆస్తుల సేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

పాతబస్తీ ప్రజలకు తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు

ఇదిలా ఉండగా, భూసేకరణ పనులు ముగింపు దశకు చేరుకుంటుండగా ప్రాజెక్టు నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు, సాంకేతిక సలహాలు అందించేందుకు జనరల్ కన్సల్టెన్సీ సేవల నియామకానికి మెట్రో సంస్థ టెండర్లను ఆహ్వానించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. అలియాబాద్ వంటి ఇరుకైన, కీలక ప్రాంతాల్లో త్వరలో ఆస్తుల కూల్చివేతలు చేపట్టి యుద్ధప్రాతిపదికన రహదారి విస్తరణ పనులను పూర్తి చేస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే పాతబస్తీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గడంతో పాటు, హైదరాబాద్ పాతనగర రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement