Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఆయన మొదటి ముఖ్యమంత్రి కానున్నారు.. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లాతో పాటు మరొక తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కవచ్చని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి తారిఖ్ హమీద్ కర్రా, గులాం అహ్మద్ మీర్ మంత్రులు అయ్యే అవకాశం ఉంది.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుండి మొత్తం ఏడుగురు మంత్రుల నియామకం
అయితే, కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 15న గులాం అహ్మద్ మీర్‌ను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నియమించిందని, అందువల్ల ఆయనకు మంత్రి పదవి పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు, నిజాముద్దీన్ భట్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే,స్వతంత్ర ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వొచ్చని ఊహాగానాలు ఉన్నాయి,ఇది జమ్మూ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుండి మొత్తం ఏడుగురు మంత్రుల నియామకం చేసే అవకాశముందని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం,2019 ప్రకారం ముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య అసెంబ్లీ సీట్లలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రమాణ స్వీకారం అనంతరం ఒమర్ అబ్దుల్లా మధ్యాహ్నం 3గంటలకు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీతో సమావేశం కానున్నారు.