Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి, అలాగే భవిష్యత్‌లో జరగనున్న సార్వత్రిక ఎలక్షన్స్‌పై చర్చించేందుకు డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం అవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి.. విస్తృతమైన ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. అలాగే మిత్ర పక్షాలతో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొనున్నారు.
డిసెంబరు 19న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం
డిసెంబరు 19న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం జరగనుంది. అది జరిగిన రెండు రోజుల తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే మరో విడత 'భారత్ జోడో యాత్ర'ను సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ యాత్రలో నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధానాంశాలుగా ఉండనున్నట్లు సమాచారం. ఈ యాత్రను తూర్పు భారతం నుంచి పడమర వైపు ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ యాత్రపై CWC నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.