Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ
కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై మార్చి 15న సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు నుంచి ముందస్తు విచారణను కోరినట్లు నేపథ్యంలో.. కేసుపై శుక్రవారం విచారణ జరగనున్నట్టు సీజేఐ నుంచి తమకు సమాచారం అందిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీల నియామకాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం మేరకు ఎన్నికల సంఘం సభ్యుల నియామకానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.
కొత్త చట్టం రాజ్యాంగ విరుద్ధం: పిటీషనర్
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల (సీఈసీ-ఈసీ అపాయింట్‌మెంట్) నియామకంపై ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం తనకు నచ్చిన సేవలందించే బ్యూరోక్రాట్‌లను సీఈసీ, ఈసీలుగా నియమించే ప్రస్తుత వ్యవస్థపై కూడా జయ ఠాకూర్ పిటిషన్‌లో ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా తర్వాత ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం రాజ్యాంగ విరుద్ధమని జయఠాకూర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదించిన సవరణను నిలిపివేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.