'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'.. లాభమా, నష్టమా?
భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలను చేస్తోంది. దీనికోసం 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'పై పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసింది. అయితే దీన్ని అమలు చేయడం అంత సాధ్యం కాదు. వాస్తవానికి గతంలో ఈ రకంగా ఎన్నికలు జరిగిన సమయంలో వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకున్నాయి. లోక్‌సభకు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలోని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రస్తుతం శాసనసభలకు, పార్లమెంట్ కు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే దీని వల్ల జరిగే లాభనష్టాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
14 రాష్ట్రాలు మద్దతుగా నిలబడాలి
ఒకే దేశం,ఒకే ఎన్నికల బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ సవరణకు లోక్ సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం మంది అనుకూలంగా ఓటు వేయాలి. మరోవైపు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం మంది దీన్ని సమర్థించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్ర వేయాలి. అంటే 14 రాష్ట్రాలకు ఈ బిల్లు తరుపున మద్దుతుగా నిలబడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్ సభలో 333 ఓట్ల బలం ఉంది. అంటే 61శాతానికి సమానం. మరో 5శాతం ఓటింగ్ సంపాదించాలంటే దానికి చాలా కష్టపడాలి. ఇక రాజ్యసభలో కేవలం 38శాతం మాత్రమే సీట్లు ఉన్నాయి.
1967 వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందు లోక్ సభ రద్దు చేయడంతో ఈ విధానం ముగిసిపోయింది. 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినా, ఆ విధానంపై అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 2016లో మరోసారి ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చారు. అయితే ఆ మరుసటి ఏడాదే దీనిపై నీతి ఆయోగ్ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించగా, దీనికి కాంగ్రెస్ సహా వామపక్షాలు దూరంగా ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ నష్టం
పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా భారీగా ఆర్థిక భారం తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుంది. ఇక ప్రభుత్వ పాలసీలు, పథకాల అమలుకు ఎన్నికల కోడ్ రూపంలో వచ్చే అడ్డంకులు తగ్గుతాయి. మరోవైపు దొంగ ఓట్లు కూడా తగ్గుతాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే స్థానిక అంశాలు, సమస్యలు కనిపించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయి. 2015 లో ఓ సర్వే ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓటు వేయనున్నారని పేర్కొంది. అసెంబ్లీకి పార్లమెంట్‌కు వేర్వేరుగా చేపడితే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గినట్లు ఆ సర్వేలో వెల్లడైంది.