Telangana: 'వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు' విధానం.. తెలంగాణలో రేషన్, ఆరోగ్య సేవలకు ఒకే కార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ డిజిటల్ కార్డులు రేషన్, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా రూపొందించాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు సమగ్ర సేవలు అందించాలని అధికారులను ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా 'ఒక రాష్ట్రం, ఒకే డిజిటల్ కార్డు' విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి తన నివాసంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి న.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో సమావేశమై ఈ డిజిటల్ కార్డుల అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
డిజిటల్ కార్డుతో ఎక్కడైనా ఆరోగ్య సేవలు పొందవచ్చు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందవచ్చని వెల్లించారు. ప్రతి కుటుంబ సభ్యుని ఆరోగ్య ప్రొఫైల్ కూడా ఈ కార్డులో పొందుపరచాలని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని 'పైలట్ ప్రాజెక్టు' కింద ఎంపిక చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లా వారీగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటక, రాజస్థాన్, హరియాణాలో ఇప్పటికే అమలైన డిజిటల్ కార్డుల నమూనాలను పరిశీలించి, రాష్ట్రానికి అనువైన సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు.