Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌తో మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో ప్రయాణం!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రయాణికులకు ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడం, నగర రహదారులపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
వివరాలు
ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద రోడ్ల విస్తరణ, బస్సు రూట్ల మార్పు
సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం ఈ అంశాలను వికాస్ రాజ్ మీడియాకు వివరించారు. నగరంలో ఉన్న 51ఎంఎంటీఎస్ స్టేషన్ల పరిసరాల్లో అనుసంధాన రహదారుల విస్తరణ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఎంఎంటీఎస్ స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీకి అందజేస్తారని తెలిపారు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని రైల్వే స్టేషన్లకు సమీపంలో బస్ స్టాప్‌లను ఏర్పాటు చేయడం, అలాగే రద్దీకి అనుగుణంగా బస్సు రూట్లను పునఃవ్యవస్థీకరించే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేట్ ఫీడర్ సర్వీసులను ప్రారంభించే అంశంపైనా పరిశీలన జరుగుతోందని తెలిపారు.
వివరాలు
అన్నింటికీ కలిపి ఒకే టికెట్ వ్యవస్థపై సాధ్యాసాధ్యాల పరిశీలన
ఇంకా ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించేలా సమగ్ర టికెటింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశాలపై అధ్యయనం చేయాలని మీ-సేవ కమిషనర్‌కు సూచించినట్లు వికాస్ రాజ్ చెప్పారు. హైదరాబాద్‌లో మల్టీమోడల్ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా ఇది కీలక ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.