Onion Price: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఉల్లి ధరల్లో మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో ఉల్లి ధరలు కిలోకు రూ.100 దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గల్ప్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి, ధరలు పడిపోయాయి. కానీ ఈ పరిస్థితి రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
రూ.100కి 8 కిలోల ఉల్లి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో రూ.100కే సుమారు 8 కిలోల ఉల్లిపాయలు లభిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల రోజుల క్రితం క్వింటా ఉల్లి ధర రూ.2,000 ఉండగా, ఇప్పుడు అది రూ.800 నుంచి రూ.1,400 మధ్యకు పడిపోయింది. ఈ ధరలు రైతులకు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి. పండించిన పంటకు ధర లేకపోవడంతో, రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కొంతమంది రైతులు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఉల్లిపాయలను రోడ్ల పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్‌కు తీసుకెళ్లే ఖర్చులు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు.
వివరాలు
టమాటా రైతులకూ దెబ్బ
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల టమాటా దిగుమతులు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా నిల్వలు పెరిగి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ.10కే లభిస్తోంది. దీంతో టమాటా పంట వేసిన రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొంతమంది రైతులు టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు. ట్రాక్టర్లలో తీసుకొచ్చి పశువులకు వేయడం, లేదా రోడ్ల పక్కనే పారబోసేయడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వివరాలు
టమాటా రైతులకూ దెబ్బ
యుద్ధ ప్రభావం దేశంలోని వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోంది. ఎగుమతులు, దిగుమతుల్లో అంతరాయం రావడంతో రైతులకు నష్టాలు పెరుగుతున్నాయి. ధరలు త్వరలో పెరిగే సూచనలు కనిపించకపోవడంతో, ఈ ఏడాది ఉల్లి, టమాటా రైతులకు నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కనీస మద్దతు ధర కూడా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.