Loading...
SIR Row: జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసనకు డిమాండ్‌.. అరెస్టు చేయాలన్న విపక్షాలు
జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసనకు డిమాండ్‌.. అరెస్టు చేయాలన్న విపక్షాలు

SIR Row: జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసనకు డిమాండ్‌.. అరెస్టు చేయాలన్న విపక్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) వ్యవహారంలో ఎన్నికల సంఘం (ఈసీ)లోని ఇద్దరు కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని, పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. కొందరు నేతలు అరెస్టు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కూడా కోరారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ,వివేక్‌ జోషి.. ఓటర్ల నమోదు,పేర్ల తొలగింపు, పునరుద్ధరణ,ఫారమ్‌-6లో మార్పులు, ఓటర్ల జాబితా డేటా నిర్వహణ తదితర అంశాలపై గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' కథనం పేర్కొంది.

వివరాలు 

ఆరోపణలను ఖండించిన బీజేపీ, ఈసీ

ఈ నివేదిక వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని మరింత తీవ్రంగా ప్రస్తావించాయి.

'బీజేపీ,ఆరెస్సెస్‌,ఎన్నికల సంఘం కలిసి దేశ ప్రజలకు అన్యాయం చేశాయి.

ప్రజలకు న్యాయం జరగాలి'అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలంటూ ఏప్రిల్‌ 24న 73 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులు నోటీసు ఇచ్చారని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న ఆ నోటీసుపై రాజ్యసభ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కూడా జ్ఞానేశ్‌కుమార్‌పై తీవ్రఆరోపణలు చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతిలో ఆయన ఒక సాధనంగా మారారని విమర్శించారు.

అయితే ఇవి కాంగ్రెస్‌ నేతలు చేసిన రాజకీయ ఆరోపణలు మాత్రమేనని,వాటిని బీజేపీ,ఈసీ అంగీకరించలేదు.

వివరాలు 

జ్ఞానేశ్‌కుమార్‌ అరెస్టు, ఎస్‌ఐఆర్‌ రద్దుకు పిలుపు

శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే మరింత తీవ్రంగా స్పందించారు.

జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆయన ఆధ్వర్యంలో జరిగిన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలని, ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

దేశవ్యాప్తంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా రద్దు చేసి, దాని ద్వారా చేసిన మార్పులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని కోరారు.

మూడు సంవత్సరాల క్రితం ఉన్న ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

సీఈసీపై విపక్షాల పోరు.. మళ్లీ ఎన్నికలకు డిమాండ్

పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా జ్ఞానేశ్‌కుమార్‌ అరెస్టుకు డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఐఆర్‌కు ముందు ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా పశ్చిమబెంగాల్‌లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

జ్ఞానేశ్‌కుమార్‌ సీఈసీగా కొనసాగుతున్నంతకాలం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌.. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించకపోతే దాని ప్రభావంతో ఏర్పడే ప్రభుత్వాల రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు.

డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని కోరారు.

ఎన్నికల సంఘం వ్యవహారాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈసీపై ప్రకాశ్‌రాజ్‌ విమర్శలు.. బీజేపీ కౌంటర్

ఎన్నికల సంఘం పనితీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా విమర్శలు చేశారు.

ఈసీ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రభావం ఉందని ఆరోపించారు.

ఎన్నికల సంఘంలోని ముగ్గురు కీలక వ్యక్తులు జ్ఞానేశ్‌కుమార్‌, నరేంద్రమోదీ, అమిత్‌షా అంటూ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం ప్రజాస్వామ్య సంస్థల్లో సహజమైన ప్రక్రియేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు.

చర్చలు, అభిప్రాయాల మార్పిడి జరగడం సంస్థలో ప్రజాస్వామ్య విధానం కొనసాగుతోందనడానికి నిదర్శనమని అన్నారు.

వివరాలు 

ఈసీ వివరణ.. పెండింగ్‌లో అభిశంసన నోటీసులు!

ఎన్నికల సంఘం కూడా ఈ ఆరోపణలపై స్పందించింది. కమిషనర్ల మధ్య అభిప్రాయాలు, పరిశీలనలు ఉండటం సంస్థలో జరిగే సాధారణ అంతర్గత చర్చలలో భాగమేనని తెలిపింది.

గత ఏడాది తీసుకున్న అన్ని నిర్ణయాలు, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు సహా, ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే జరిగాయని ఈసీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, జ్ఞానేశ్‌కుమార్‌పై ఇప్పటికే మార్చి 12, ఏప్రిల్‌ 24 తేదీల్లో ప్రతిపక్షాలు అభిశంసన నోటీసులు ఇచ్చినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

మొదటి నోటీసును రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ తిరస్కరించగా.. ఏప్రిల్‌ 24న ఇచ్చిన మరో నోటీసు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

ADVERTISEMENT