ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే
దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అతిథుల కోసం వీవీఐపీ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఖర్గే కుర్చీ ఖాళీగా కనిపించింది. అనారోగ్యం కారణంగానే ఈ వేడుకలకు ఖర్గే రాలేకపోయారని కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు దేశ ప్రజలందరికీ ఖర్గే 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మన దేశానికి ఆత్మ అని, దేశ ఐక్యత, సమగ్రత, ప్రేమ, సోదరభావం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్వేచ్ఛను తాము సమర్థిస్తామన్నారు. ఈ మేరకు ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు.
బీజేపీ మాజీ ప్రధాని వాజ్ పేయీ సేవలనూ గుర్తుచేసిన ఖర్గే
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీని ఉద్దేశించి ఖర్గే విమర్శలు సంధించారు. ట్విట్టర్లో వీడియో సందేశంలో భాగంగా దేశ ప్రగతి కోసం మాజీ ప్రధాన మంత్రుల సేవలను గుర్తుచేసుకున్నారు. తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ పేర్లను వీడియోలో ప్రస్తావించారు. బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయీ సేవలను సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు ప్రమాదంలో ఉన్నట్లు ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సాధనాలను వెతికి మరీ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీలతో పాటు భారత ఎన్నికల సంఘాన్నీ బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.