VB-G RAM G: వీబీ-జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ.. సంవిధాన్ సదన్ వెలుపల ప్రతిపక్షాల ధర్నా
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ముద్ర పడింది. గురువారం సాయంత్రం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, కొద్ది గంటల వ్యవధిలోనే రాజ్యసభకు చేరగా, అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో అక్కడ కూడా ఆమోదం లభించింది. ఆ తర్వాత వాయిదా పడింది. సుదీర్ఘంగా సభ కొనసాగడం విశేషం. తగినంత చర్చకు అవకాశం ఇవ్వకుండా, తొందరపాటుగా బిల్లులను ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపిస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి 12.40 గంటలకు రాజ్యసభ భవనం వెలుపల ధర్నాకు దిగాయి.
వివరాలు
లోక్‌సభలో సుమారు 8 గంటలు, రాజ్యసభలో 5 గంటల పాటు చర్చ
గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇరు సభల్లోనూ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. లోక్‌సభలో స్పీకర్ పీఠం వద్దకు వెళ్లిన విపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరేశారు. బిల్లు ఆమోదం అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలో సుమారు 8 గంటలు, రాజ్యసభలో 5 గంటల పాటు సాగిన చర్చకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు. మునుపటి పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకే ఈ మార్పులు తీసుకువచ్చామని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
శాశ్వత ఆస్తులు సమకూర్చడమే ధ్యేయం
కేవలం కూలీల వేతనాలకే రూ.10-11 లక్షల కోట్లను ఖర్చు చేయకుండా,గ్రామాల్లో శాశ్వత ఆస్తులు రూపొందించాలన్న ఉద్దేశంతో లోతైన చర్చల అనంతరం ఈ బిల్లును రూపొందించామని చౌహాన్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ ఎన్నిసార్లు తుంగలో తొక్కిందో దేశం చూసిందని,రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటోందని విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి బిల్లును పంపాలన్న డిమాండ్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల వరకూ సభలో చర్చ సాగిందని, అన్ని పార్టీల నుంచి 98 మంది సభ్యులు మాట్లాడిన అంశాలను వినామని చెప్పారు.
వివరాలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం: ఖర్గే
లోక్‌సభ ఆమోదించిన వెంటనే మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అధ్యయనం చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగాయి. గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ,మల్లికార్జున ఖర్గే,అలాగే ఎంపీలు కేసీ వేణుగోపాల్,కనిమొళి,టి.ఆర్. బాలు,ఏ. రాజా తదితరులు పాల్గొన్నారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని వారు డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీని మోదీ ప్రభుత్వం అవమానించిందని,గ్రామీణ ప్రజల పనిహక్కును హరించిందని ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.
వివరాలు
అణుఇంధన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించే 'శాంతి' బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం తెలిపింది. గురువారం రాజ్యసభ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్‌సభ ఇప్పటికే బుధవారమే దీనికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లుపై జరిగిన చర్చకు అణు ఇంధన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. రోజంతా నిరంతర విద్యుత్తు సరఫరా అందించగల నమ్మకమైన వనరు అణు ఇంధనమేనని, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల్లో అలాంటి స్థిరత్వం లేదని ఆయన పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అణు భద్రతపై వ్యక్తమవుతున్న భయాలను ఆయన కొట్టిపారేశారు.
వివరాలు
అణుఇంధన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అయితే, జవాబుదారీతనానికి సంబంధించిన నిబంధనలను బలహీనపరిచారంటూ పలువురు విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగాన్ని పణంగా పెట్టి ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించవద్దని, దేశీయ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని జైరాం రమేశ్ (కాంగ్రెస్) సూచించారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిర్బంధంగా బిల్లును ముందుకు తీసుకురావద్దని హెచ్చరించారు. 'శాంతి' బిల్లుకు వెనుక అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని కొందరు సభ్యులు విమర్శించారు. అయితే పెట్టుబడులను ఆకర్షించి, రాబోయే తరాలకు అణు ఇంధనాన్ని అందించేందుకు ఈ బిల్లు కీలకమని హర్ష్‌వర్ధన్ శ్రింగ్లా (భాజపా) తెలిపారు.
వివరాలు
అణుఇంధన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలంటే అవసరమైన రూ.19 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ప్రైవేటు రంగ సహకారం తప్పనిసరి అని ఆయన సమర్థించారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బాధ్యతాయుత భాగస్వామ్యమేనని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ఎంపీ సుధామూర్తి కూడా మద్దతు ప్రకటించారు. 'శాంతి' బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడం ఒక చారిత్రక ముందడుగని, దీని ద్వారా ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కలుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్లమెంట్ ముందు నిరసనకు దిగిన ప్రతిపక్షాలు
Friday morning 2 am . @AITCofficial 12 hour dharna on the steps of Parliament in protest against the destruction of MNREGA by anti people @narendramodi govt pic.twitter.com/l0CP95iQUX
— Sagarika Ghose (@sagarikaghose) December 18, 2025