Loading...
Ayodhya Donation Skit: అయోధ్య విరాళాల వివాదం.. పార్లమెంట్‌లో పప్పు యాదవ్ వినూత్న స్కిట్
అయోధ్య విరాళాల వివాదం.. పార్లమెంట్‌లో పప్పు యాదవ్ వినూత్న స్కిట్

Ayodhya Donation Skit: అయోధ్య విరాళాల వివాదం.. పార్లమెంట్‌లో పప్పు యాదవ్ వినూత్న స్కిట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ పార్లమెంట్ ఆవరణలో వినూత్నంగా స్కిట్ ప్రదర్శించి నిరసన తెలిపారు. కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషంలో వచ్చిన పప్పు యాదవ్,పార్లమెంట్ ప్రాంగణంలో కూర్చొని హుండీ పేరిట విరాళాలు సేకరించినట్లు నటించారు. ఈ స్కిట్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు రుచి వీరా (మొరదాబాద్),అవధేశ్ ప్రసాద్ (అయోధ్య) కూడా పాల్గొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అతిథి పాత్రలో కనిపించి హుండీలో కొంత మొత్తం వేసినట్లు నటించారు.

వివరాలు 

వినూత్నంగా నిరసన తెలియజేయడమే ఈ స్కిట్ ఉద్దేశ్యం అన్న విపక్ష సభ్యులు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు పలువురు విపక్ష ఎంపీలు కూడా విరాళాలు ఇచ్చినట్లుగా స్కిట్‌లో భాగమయ్యారు.

స్కిట్ ముగింపు భాగంలో, సేకరించిన విరాళాలతో సన్యాసి అక్కడి నుంచి పారిపోతాడు.

అది గమనించిన ఎంపీలు అతడిని వెంబడించి పట్టుకుని నిలదీసినట్లు నటించడంతో ప్రదర్శన ముగిసింది.

అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై తమ నిరసనను వినూత్నంగా తెలియజేయడమే ఈ స్కిట్ ఉద్దేశమని విపక్ష సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ,ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు.

వివరాలు 

పప్పుయాదవ్ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం

అయితే,గత కొద్ది రోజులుగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగడంతో ఈ విషయం చర్చకు రాలేదని పేర్కొన్నారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలని తాను నోటీసులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు.

అందుకే పప్పుయాదవ్ ప్రతిపాదనతో ఈ స్కిట్ నిర్వహించినట్లు వివరించారు.

ఇదిలా ఉండగా,కాషాయ వస్త్రధారణలో సభా ప్రాంగణానికి వచ్చిన పప్పుయాదవ్ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు.

సభకు ఇలాంటి విభిన్న వేషధారణలతో రావడం తగదని సూచించారు. పప్పు యాదవ్ పేరు ప్రస్తావించకుండా,"సభకు విభిన్న వేషధారణలతో వచ్చే సభ్యులు పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి" అని స్పీకర్ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామాలయ విరాళాల అంశంపై విపక్షాల నిరసన.. పార్లమెంట్‌లో స్కిట్ ప్రదర్శన

ADVERTISEMENT